పూర్వ విద్యార్థుల సహకారం..వర్సిటీకి వరం
తాళపత్రాల జ్ఞానాన్ని వినియోగంలోకి తేవాలి ● ‘వేవ్స్ 2025’లో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి
ప్రసంగిస్తున్న సుధామూర్తి
కార్యక్రమానికి హాజరైన పూర్వవిద్యార్థులు
మద్దిలపాలెం: ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సమ్మేళనం ‘వేవ్స్ 2025’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమె ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని సందర్శించి, సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం.రావుతో కలిసి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించాల్సిన విధానంపై ఆమె పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఏయూలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బలమైన పూర్వవిద్యార్థుల బంధాన్ని ఏర్పరచడం, బోధనను పటిష్టం చేయడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె ఏయూ పరిపాలనా భవనం నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ రతన్ టాటా ఆవిష్కరించిన ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం పైలాన్‌ను సందర్శించారు. ప్రధాన వేదికపై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్‌రాజా, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఇతర ఈసీ సభ్యులు, పూర్వ చైర్మన్ పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల సహకారం..వర్సిటీకి వరం


