టెట్ నుంచి మినహాయించాలి
అనకాపల్లి : ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఈటీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ధర్నా చేపట్టి, ఆర్డీవో షేక్ అయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఈటీ అనేది 2010 లో ప్రభుత్వం ప్రవేశశపెట్టిందని, 2010 తర్వాత ప్రకటించిన అన్ని డీఎస్సీల్లో టెట్ పరీక్షలు కూడా కలిపి నిర్వహించారని, 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ రాసుకునే అవకాశం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్ష పాస్ అవ్వాలని, లేని పక్షంలో ఉద్యోగాలు వదులుకోవాలని వ్యాఖ్యానించిన ఫలితంగా దేశవ్యాప్తంగా లక్షల మంది ఉపాధ్యాయుల భవిషత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం పార్లమెంటుకు లెటర్ రాసి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేవరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎ.ప్రకాష్, నడిగట్ల శేషుకుమార్, సీనియర్ నాయకురాలు ఎస్‌ఎస్ నాగమణి, మండల నాయకులు చింతాడ వెంకటరమణ, మామిడి బాబురావు, రేబాక రవి, శంకర్, సత్యవేణి, ఝాన్సీ, కిషోర్, శివశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.


