ఆర్టీసీ బస్సు ఢీకొని చుక్కల జింక మృతి
జాతీయరహదారిపై ప్రమాదంలో మృతి చెందిన చుక్కల జింక
ఆరిలోవ (విశాఖ): జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చుక్కల జింక మృతి చెందింది. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాలివి. కంబాలకొండ అభయారణ్యం నుంచి ఓ చుక్కల జింక జూపార్క్ దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో నగరం నుంచి మధురవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ జింకను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దహనం చేశారు. కాగా, కంబాలకొండ అభయారణ్యం నుంచి జింకల గుంపులు ఆహారం, నీటి కోసం తరచూ జాతీయ రహదారిపైకి వస్తున్నాయని, వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


