టెన్త్ విద్యార్థులు క్షేమం
● అనకాపల్లిలో దొరికిన పిల్లలు.. తల్లిదండ్రులకు అప్పగింత
ఎన్టీఆర్ స్టేడియంలో దొరికిన పదో తరగతి విద్యార్థులు
రాంబిల్లి (అచ్యుతాపురం)/అనకాపల్లి టౌన్: రాంబిల్లి మండలం పంచదార్లలోని బీసీటీ విద్యార్థుల అదృశ్యం కేసు సుఖాంతమైంది. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అదృశ్యమైన ఆరుగురు విద్యార్థులు అనకాపల్లిలో పోలీసులకు చిక్కారు. విద్యార్థులు అదృశ్యం అయ్యారన్న సంగతి తెలుసుకొని యాజమాన్యం మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కాగా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో ఉన్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాంబిల్లి తరలించారు. సీఐ నరసింగరావు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమక్షంలో అప్పగించారు. విద్యార్థులు ఎందుకు వెళ్లిపోయారు.. మంగళవారం రాత్రి ఎక్కడ తల దాచుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. బాగా చదవాలని పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పిన నేపథ్యంలో విద్యార్థులు వెళ్లిపోయారని భావిస్తున్నారు. విద్యార్థులను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


