ప్రజాగ్రహానికి సంకేతం
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో వెల్లువెత్తిన ప్రజాగళం
● జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని మించి సంతకాల సేకరణ
● సంతకాల ప్రతులు నియోజకవర్గ కేంద్రాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలింపు
సంతకాల పత్రాలతో కూడిన వాహనం వెంట పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఈర్లె అనురాధ
సాక్షి, అనకాపల్లి:
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం శుక్రవారం హోరెత్తింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో జిల్లావ్యాప్తంగా ‘కోటి సంతకాల సేకరణ’ ఉద్యమం ముమ్మరంగా సాగింది. జిల్లాలో సుమారు రెండు నెలల నుంచి సాగుతున్న ఈ మహా ఉద్యమంలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలియజేశారు. జిల్లాలో ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో నిర్ణీత లక్ష్యాన్ని మించి భారీగా సంతకాల సేకరణ జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ‘రచ్చబండ కార్యక్రమం’ ద్వారా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులను అనకాపల్లి టౌన్‌లో రింగురోడ్డు వద్ద గల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకువచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కు అప్పగించారు. వందలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, యువత, మేధావులు సైతం ర్యాలీలో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 96 వేల సంతకాలు సేకరించారు. అత్యధికంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 61 వేలు, అనకాపల్లి నియోజకవర్గంలో 60 వేలు, పాయకరావుపేట నియోజకవర్గంలో 60 వేలు, పెందుర్తిలో 55 వేలు, చోడవరం, మాడుగుల, యలమంచిలి నియోజకవర్గాల్లో 60 వేల చొప్పున సంతకాల సేకరణ జరిగింది.
అనకాపల్లి రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి భీమునిగుమ్మం వరకు ర్యాలీ నిర్వహిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, పార్టీ శ్రేణులు
నర్సీపట్నంలో సంతకాల ఆమోద పత్రాల బుక్‌లెట్లను చూపుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకురాలు హైమావతి, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
అనకాపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షడు గుడివాడ అమర్‌నాథ్ పత్రాలను స్వీకరించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జిల్లా సమన్వయకర్తలతో కలిసి ఆయన మీడియా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి అంచనాలకు మించి మద్దతు లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమాల ద్వారా ‘కోటి సంతకాల సేకరణ’లో ప్రజలు, విద్యార్థులు, మేధావులు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. రాష్ట్రమంతా ఏకమై చంద్రబాబు సర్కార్‌ను బంగాళా ఖాతంలో కలిపే రోజు వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గ సమన్వయకర్తలకు, మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు, జిల్లా, నియోజకవర్గాల అనుబంధ సంఘల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అమర్‌నాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు శోభ హైమావతి, రాష్ట్ర కార్యదర్శులు సరగడం చిన్నప్పలనాయుడు, పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి హేమంత్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు త్రినాథరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిసెట్ సురేష్ రాజ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అమర్‌నాథ్
ప్రజాగ్రహానికి సంకేతం
ప్రజాగ్రహానికి సంకేతం


