750 మొబైల్ ఫోన్లు రికవరీ
అనకాపల్లి: జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పని చేస్తోందని, 11వ విడతలో 750 మొబైల్ రికవరీ (విలువ సుమారు రూ.కోటి 50 లక్షలు) చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి, మొబైల్ రికవరీ మేళా నిర్వహించి, బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల రికవరీకి 3 నెలల సమయం పట్టిందన్నారు. జిల్లాలో ఐటీ కోర్ టీమ్ చేస్తున్న నిరంతర కృషి వలన రాష్ట్రంలో, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి చోరీకి గురైన మొబైల్స్‌ను బాధితులకు అందజేశామన్నారు. 11వ విడతలో 750 మొబైల్ ఫోన్లు (యాపిల్, శాంసంగ్, వివో, రెడ్ మి మొదలైనవి) రికవరీ చేశామని, నేటి వరకూ 4,086 మొబైల్ ఫోన్లను రికవరీ చేిధితులకు అందజేశామని, వీటి విలువ సుమారుగా రూ.6.77 కోట్లు ఉంటుందన్నారు.
మన రాష్ట్రంలో తూర్పు గోదావరి, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల నుంచి మొబైల్స్‌ను తీసుకొని వచ్చామన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే పరికరం మాత్రమే కాదని, మన ’పర్సనల్ ఐడెంటిటీ’గా మారిందన్నారు. మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సీఈఐఆర్ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన www.ceir.gov.inలో లాస్ మొబైల్ ఆప్షన్ ద్వారా ఐఎంఈఐ నంబర్, ఫోన్ మోడల్ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. లేని పక్షంలో జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 93469 12007 కు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్‌రావు, సైబర్ సెల్ సీఐ బి.వెంకట రావు, ఇతర సీఐలు బాలసూర్యా రావు, టి.లక్ష్మి, రమేష్, ఐటీ కోర్ ఎస్‌ఐ బి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


