జనసేన ఆఫీస్‌లో మద్యపానం
సాక్షి, అనకాపల్లి: పదిమందికీ ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పార్టీ కార్యాలయంలోనే మందుతాగి తూగిన వైనం ఇది. జనసేన కార్యాలయంలో పార్టీ నాయకుడు మద్యం తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర పార్టీ కార్యాలయంలో మద్యం తాగుతున్న వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతంత మాత్రమే. ఒక వర్గం నాయకులు సూర్యచంద్ర ప్రమేయం లేకుండా ఆగస్టులో నర్సీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో తన ఉనికికి ఎక్కడ ముప్పు కలుగుతుందోనన్న ఆందోళనతో సూర్యచంద్ర తన సొంత మండలమైన నాతవరంలో సెప్టెంబర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోనే ఆయన మందు తాగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి దగ్గరగా వ్యవహరించే సూర్యచంద్ర వీడియోలపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.


