రైతన్నను బతికించండి
అనకాపల్లి టౌన్: ధ్యానం, పత్తి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి, ఆయా పంటలను కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. పట్టణంలోని సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను తక్షణమే ఆదుకోవాలని బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుడ్ సబ్సిడీని చెల్లించాలన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా నాలుగురోడ్ల జంక్షన్ వద్ద రైతుల మెడకు ఉరి వేయద్దు అన్నట్లుగా నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేశ్వరి, ఫణీంద్రకుమార్, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.


