రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
● ‘యలమంచిలి’ని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్
● నక్కపల్లి కేంద్రం సుదూరం కావడంతో జీవో 1491ను సవరించాలని వినతి
మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మునగపాకలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపడం సరికాదంటూ చేపట్టిన దీక్షకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులు సంఘీబావం తెలిపారు. ముందుగా సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జీవో 1491ను సవరించి యలమంచిలి నియోజకవర్గాన్ని యథావిధిగా అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించేలా చూడాలన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లి డివిజన్‌కు ఇక్కడ నుంచి వెళ్లాలంటే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అనకాపల్లి డివిజన్ ద్వారా సేవలు పొందుతున్న ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేలా నక్కపల్లి కేంద్రానికి బదలాయించడం సరికాదన్నారు. స్థానిక శాసనసభ్యుడు స్పందించి రెవెన్యూ డివిజన్‌కు సంబందించి తన వైఖరిని వెల్లడించాలన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు, సర్పంచ్‌లు కాండ్రేగుల నూకరాజు, దిమ్మల అప్పారావు, భీశెట్టి గంగప్పలనాయుడు, ఆడారి త్రిమూర్తులు, బొడ్డేడ శ్రీనివాసరావు, కర్రి పెదబ్బాయి, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, సూరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు మూలపేట, పాటిపల్లి, నారాయుడుపాలెం గ్రామాలకు చెందిన రాంబాబు, అప్పారావు, కుమార్, సత్యనారాయణ, ధనశ్రీను, కాండ్రేగుల నాగేశ్వరరావు, మొల్లేటి పరమేష్, గోవిందరావు, ఆదికుమార్, వెంకట నూకప్పారావు,ఆ డారి శివ,నాగేశ్వరరావు తదితరులు నిరాహార దీక్షలో కూర్చొన్నారు.
రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు


