గాడి తప్పుతున్న మండల పరిషత్ సమావేశాలు
నర్సీపట్నం: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోంది. నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన సమావేశాలను అధికారులు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. మండల పరిషత్ సమావేశాల విధి విధానాలను ఎంపీడీవోలు గాలికి వదిలేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పార్లమెంట్, శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మండల పరిషత్ సమావేశాలు జరపకూడదు. ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ్యులు, ఎమ్మెల్సీలు మండల పరిషత్ సమావేశాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించకూడదు. దీనికి భిన్నంగా నియోజకవర్గంలో ఎంపీడీవోలు వ్యవహరించారు. నాతవరం ఎంపీడీవో సమావేశాన్ని రద్దు చేయగా, గొలుగొండ ఇన్‌చార్జీ ఎంపీడీవో శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించి నిబంధనలను తుంగలో తొక్కారు.
ఆఖరు నిమిషంలో హడావుడిగా..
ఒక సమావేశం నిర్వహించిన తరువాత తదుపరి సమావేశాన్ని 90 రోజుల వ్యవధిలో నిర్వహించాలి. సాధారణంగా పార్లమెంట్, శాసనసభల్లో బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఆ సమావేశాల ప్రకటన కూడా ముందుగానే వెలువడుతుంది. ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని మండల పరిషత్ సమావేశాల తేదీలు నిర్ణయించాల్సి ఉంది. అయితే ఆఖరు నిమిషంలో హడావుడిగా సమావేశాల నిర్వహణకు ఎంపీడీవోలు సిద్ధపడుతున్నారు. దీంతో సమావేశాల నిర్వహణ గందరగోళంగా మారుతోంది. పలుసార్లు పలు మండలాల్లో ఇదే కారణంతో సమావేశాల తేదీలు ప్రకటించడం, మళ్లీ వాయిదాలు వేయటం చేస్తున్నారు. లేదా సెలవు దినాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వివిధ శాఖల అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చట్ట సభల సమావేశాలు జరుగుతున్నప్పుడు, సమావేశాలకు సమయం మించిపోతే ముందుగా మండల పరిషత్ పరిధిలోకి వచ్చే చట్టసభల సభ్యులకు తెలియజేయాలి. వారి అనుమతితో సమావేశాలు జరుపుకునేందుకు అవకాశం ఉంది. చట్ట సభల సభ్యుల అనుమతి తీసుకోవటం చాలా అరుదు. నాతవరం మండల పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహించాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల కారణంగా సెలవు దినమైన ఆదివారానికి వాయిదా వేస్తూ ఎంపీడీవో నిర్ణయం తీసుకున్నారు. గొలుగొండ ఎంపీడీవో శ్రీనివాసరావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఒకపక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగానే మంగళవారం నిర్వహించారు. ఇలా నిర్వహించటం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇప్పటికై నా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


