నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి సంతకాల పత్రాలు
అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేత
అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను బుధవారం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా లక్షల మంది నుంచి సంతకాలు సేకరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఉదయం 10.30 గంటలకు అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో వాటిని అందజేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
సంతకాల పుస్తకాల సేకరణకు వివిధ నియోజకవర్గాలకు 7 వాహనాలు
కోటి సంతకాల ప్రతులను అనకాపల్లిలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించడానికి 7 వాహనాలను సమకూర్చినట్టు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ చెప్పారు. వాటిని నియోజకవర్గ కేంద్రాలకు మంగళవారం రాత్రి జెండా ఊపి పంపించారు. అంతకుముందు ఈ వాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పుస్తకాలను సేకరించి, అనకాపల్లి రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు చేరుకుంటాయని చెప్పారు. ఈనెల 15న నెహ్రూచౌక్ వరకూ పాదయాత్రగా పార్టీ శ్రేణులు వెళ్లి అక్కడ నుంచి విజయవాడకు బయలు దేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్‌ఛార్జ్ కె.ఎం.నాయుడు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, గవర కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, మాజీ కౌన్సిలర్ దాడి నారాయణరావు పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.


