‘సంతకమే’ సమర శంఖం
యలమంచిలి రూరల్: పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదా అంటూ సామాన్యుల గళాలు గర్జిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యలమంచిలి నియోజకవర్గంలో యువతీ, యువకులు, వివిధ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. పార్టీ పిలుపు మేరకు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సంతకాల సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాలుగు మండలాల్లో కార్యకర్తలు, నాయకులకు సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యాన్ని వివరించి వారిలో చైతన్యం నింపారు. దీంతో పార్టీ శ్రేణులు సంతకాల సేకరణను గ్రామాల వారీగా ఉద్యమంలా చేపట్టారు. యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 107 పంచాయతీలు, యలమంచిలి మున్సిపాలిటీ 25 వార్డుల్లో సేకరించిన సుమారు 55 వేల సంతకాలతో కూడిన పత్రాలను పుస్తకాలుగా తయారు చేశారు. వీటన్నింటినీ బుధవారం యలమంచిలి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజా చైతన్య ఉద్యమ రథంపై తరలించనున్నారు. ఇందు కోసం యలమంచిలిలోని పార్టీ కార్యాలయం నుంచి అనకాపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నట్టు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, ముఖ్య నాయకులందరికీ ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగే ర్యాలీకి పార్టీ నాయకులంతా హాజరు కావాలని కోరారు.
పీపీపీ వద్దంటూ గళం విప్పిన ప్రజలు
దేశంలోనే మొట్టమొదటి సారిగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారు వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించలేదు. పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడానికి పూనుకుంది. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా వైద్య సీట్లు వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గత అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ నుంచి తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం వరకు ఉద్యమం ఉధృతంగా సాగింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు సైతం వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి మద్దతునిచ్చాయి. విద్యార్థులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనడంతో పార్టీ నేతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై
సర్వత్రా వ్యతిరేకత
యలమంచిలిలో ఉద్యమంలా
55 వేల సంతకాలు పూర్తి
స్వచ్ఛందంగా పాల్గొన్న యువతీ, యువకులు
నేడు అనకాపల్లి పార్టీ ఆఫీసుకు
సంతకాల పుస్తకాల తరలింపు
పార్టీ శ్రేణులు తరలిరావాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ధర్మశ్రీ పిలుపు
‘సంతకమే’ సమర శంఖం
‘సంతకమే’ సమర శంఖం


