సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలివ్వాలి
కలెక్టరు విజయ కృష్ణన్
తుమ్మపాల: దేశ రక్షణలో అసువులు బాసిన, విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖ జిల్లా సైనిక సంక్షేమ వింగ్ కమాండర్ చంద్రశేఖర్‌తో కలిసి జెండాను, వాల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పౌరులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ మహత్తర కార్యానికి పెద్ద మనసుతో సహకరించాలన్నారు. జిల్లాలో సైనిక్ సంక్షేమ భవన నిర్మాణానికి 70 సెంట్ల భూమి, జిల్లాలో 9 మంది యుద్ధవీరులకు 300 గజాల చొప్పున స్థలం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పతాక దినోత్సవ నిధికి ఆమె విరాళం అందజేశారు. సూపరింటెండెంట్ జి.కృష్ణారావు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అగ్గాల హనుమంతరావు పాల్గొన్నారు.
పది, ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజిన, సాంఘిక, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీ,, ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. బాలికల హాస్టళ్లలోకి సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జి.వినోద్‌బాబు, జిల్లా బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.


