రేషన్ డిపో డీలర్ అక్రమాలపై విచారణ
పరవాడ: అనకాపల్లి మండలంలోని వెన్నలపాలెం రేషన్ డిపో–19 డీలర్ గొరుపూటి వెంకునాయుడు పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి రేషన్ డిపోలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమకు అందించే బియ్యం, పంచదార పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు లబ్ధిదారులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బియ్యంలో 20 కిలోల వద్ద కిలో, 10 కిలోల వద్ద అర కిలో బియ్యం తక్కువగా పంపీణీ చేస్తున్నారని అధికారులకు తెలిపారు. కిలో రూ.17కు అందించాల్సిన పంచదారకు రూ.20 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రామంలో నివసిస్తున్న వారికి రేషన్ సరకులు పంపీణీ చేయలేదని, ప్రశ్నిస్తే దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకోవాలని చెప్తున్నారని లబ్ధిదారులు ఆర్‌ఐ రమణకు మొరపెట్టుకున్నారు. దీనిపై తహసీల్దార్ బి.నాగరాజును వివరణ కోరగా రేషన్ డిపో డీలర్ అవకతవకలపై అందిన ఫిర్యాదు మేరకు డిపోను తనిఖీ చేయాలని ఆర్‌ఐని ఆదేశించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎస్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు
చోడవరం: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా చోడవరం గర్‌ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఐ.వి.రామిరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె. పరదేశి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా పి.వి.జి.ఎన్ గంగాధర్, గౌరవ అధ్యక్షుడుగా ఆచంట రవి, మహిళా కన్వీనర్‌గా సిహెచ్ సునీత, కోశాధికారిగా జి. అచ్యుతరావు, ఉపాధ్యక్షుడిగా ఆర్.ఉదయ్‌భాస్కర్, టి.రాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా టి.భాస్కర్, డి.భీమరాజు, డి.ప్రేమ్‌కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కె. సూర్యప్రకాష్, కె.వరహాలదొర, సురేష్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా వై.అప్పారావు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, ఉపాధ్యాయులకు యాప్ భారం తగ్గించాలని, ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, టీఈటీ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, పీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శి పరదేశి డిమాండ్ చేశారు.
రేషన్ డిపో డీలర్ అక్రమాలపై విచారణ


