ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం
అనకాపల్లి: ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు తక్షణమే చేపట్టాలని సూచించారు. తల్లి బిడ్డకు జన్మనివ్వగానే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు. ఏదైనా కారణం చేత నమోదు కాలేకపోతే అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోనే ఆధార్ నమోదు తప్పనిసరిగా జరగాలన్నారు. విద్యార్థుల ఆధార్ నవీకరణ కోసం జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 124 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 కేంద్రాలే ఎందుకు పనిచేస్తున్నాయని ప్రశ్నించారు.
శాఖల వారీగా లక్ష్యాలు పూర్తి చేయాలి
శాఖలవారీగా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాల కల్పన, సరాసరి వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. నియోజకవర్గానికి ఒక పశువుల వసతిగృహం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సిటిజన్ ఈ కేవైసీ, 05–17 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆధార్ అప్డేట్, ఆధార్ సీడింగ్ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు. బాల్య వివాహ్ ముక్త భారత్‌లో భాగంగా 100 రోజుల బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. దీనిపై అన్ని వర్గాల వారికీ అవగాహన కల్పిస్తామని, ప్రతి పాఠశాలలో బాల్యవివాహరహిత ప్రతిజ్ఞను చేయిస్తామని చెప్పారు.
కలెక్టర్ విజయ కృష్ణన్


