నైపుణ్యాలు పెంచుకోవడంతో ఉన్నత శిఖరాలు
అనకాపల్లి: విద్యా రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యతోపాటు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్ తెలిపారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని డీవీఎన్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కోర్సులో శిక్షణా(ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్) కార్యక్రమాన్ని సోమవారం ఆయన జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఏడాదిపాటు నిర్వహించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. తాను విశాఖలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఏయూకు వీసీ కావడం గొప్పవరంగా భావిస్తున్నానని, నేటి విద్యార్థులు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం లాంటి మేధావులుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఏదైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముందుగా ఒక లక్ష్యం నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సొంత ఆలోచనలతో చదివిన దానికి సరిపోయే విధంగా అవకాశాలను వెతుక్కోవాలన్నారు. తెలుగులో మాట్లాడడం వల్ల ఆంగ్ల ప్రావీణ్యత సాధించలేమని భయాన్ని తొలగించినట్లయితే విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏయూ డీన్ అవుట్ రీచ్ డి.లలితా భాస్కరి, డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కోరిబిల్లి రమేష్, వైన్ ప్రిన్సిపాల్ ఎస్.దయామాధురి, కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ఫ్యాకల్టీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్


