విత్తన, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి
అనకాపల్లి: రైతులను ఇబ్బందులకు గురిచేసే విత్తన, విద్యుత్ చట్టాల బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో రైతు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన బిల్లును మోడల్ చట్టంగా చేసి రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించాలని, నకిలీ విత్తనాలకు జరిమానాతోపాటు ఐదేళ్లు నిషేధం విధించాలని, నష్టపోయిన రైతులకు 60 రోజుల్లో గరిష్ట దిగుబడికి సమానమైన పరిహారం ఇవ్వాలని, ఒప్పందం చేసుకున్న ధరతో విత్తన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, రైతులు, రైతు సంఘాలు అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే పార్లమెంట్‌లో ఆమోదానికి పెట్టాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతాంగానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని, తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజానా దొరబాబు, వివిధ రైతు సంఘాల నాయకులు గండి నాయనబాబు, తాకాశి వెంకటేశ్వరరావు, వియ్యపు రాజు, వైఎన్ భద్రం, కోరుబిల్లి శంకరరావు, పప్పల ఈశ్వరరావు, నరాలశెట్టి సత్యనారాయణ, కండుబోతుల బుజ్జి పాల్గొన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా రైతు నాయకుల ధర్నా


