ఆటవిడుపుగా వెళ్లి అనంతలోకాలకు..
దేవరాపల్లి: సెలవు రోజే ఆ విద్యార్థికి చివరి రోజైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకోవడానికి వెళ్లి రామాలయంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ విషాదాకర సంఘటన మండలంలోని గరిశింగిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీస్‌లు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని తెనుగుపూడికి చెందిన కోన దినేష్ (13) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పక్క గ్రామమైన గరిశింగిలో స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ నేపథ్యంలో ఆటవిడుపుగా రామాలయంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు, కుటుంబీకులకు సమాచారం అందించి 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. సత్యనారాయణ కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్‌లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
తెనుగుపూడిలో విషాద ఛాయలు...
విద్యార్థి మృతితో తెనుగుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు తల్లిదండ్రులు చిననర్సిబాబు, లక్ష్మి కూలి పనులు చేస్తుంటారు. వీరి రెండో కుమారుడు దినేష్ మృతిని తట్టుకోలేక గుండెలవిసేలా రోదించారు.
రామాలయంపై నుంచి జారిపడి విద్యార్థి మృతి


