అనంతుని దీపోత్సవం
ఆధ్యాత్మిక వైభవం
పద్మనాభం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న అనంత పద్మనాభుడి దీపోత్సవాన్ని ఈ నెల 19న గతం కంటే వైభవంగా నిర్వహిచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. శైవ, వైష్టవ ఆలయాలు ఒకే ప్రాంగణంలో కొలువై ఉండడం పద్మనాభం ప్రత్యేకత. శివ పూజలకు అనుకూలమైన కార్తీకంలో వైష్ణవ సంప్రదాయం కలిగిన అనంత పద్మనాభుని గిరి మెట్లపై శైవ సంప్రదాయాన్ని ప్రతిబింభించే దీపోత్సవం నిర్వహించడం అలనాటి శైవ, వైష్ణవ భక్తుల ఆధ్యాత్మిక సమైక్యతను చాటి చెప్తోంది.
హైందవ సంప్రదాయ విశిష్టతకు ప్రతీక
ఇక్కడి దీపోత్సవం హైందవ సంప్రదాయ విశిష్టతకు ప్రతీకగా నిలుస్తుంది. సృష్టికి మూల పురుషుడైన అనంత పద్మనాభుని ప్రాచీన ఆలయాలు దేశంలో రెండు చోట్లే ఉన్నాయి. ఒకటి కేరళలోని తిరువనంతపురం, రెండోది మన పద్మనాభం. రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజు అనంత పద్మనాభస్వామి కొండ మెట్ల పంక్తిపై దీపాలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. గిరి ప్రథమ పావంచా నుంచి గిరి శిఖరం వరకు 1,278 మెట్లకు ఇరువైపులా తైల దీపాలంకరణ ఉత్సవాన్ని ఈ ప్రాంత భక్త జనం దిగ్విజయంగా నిర్వహిస్తూ హైందవ సంప్రదాయాన్ని వ్యాప్తిచేస్తున్నారు. దీపోత్సవం జరిగే రోజు మధ్యాహ్నానికే భారీ ఎత్తున మహిళలు పద్మనాభం చేరుకుని కొండ మెట్లను పోటీపడి రిజర్వు చేసుకుంటారు. దీపోత్సవం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. గిరిపై జేగంట మోగగానే భక్తులంతా ఒకేసారి దీపాలు వెలిగిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అనంత పద్మనాభుని చిన్న ఉత్సవ విగ్రహాలు గిరి దిగువన ప్రథమ పావంచా వద్ద కొలువు దీరుతాయి. ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గిరిపైన అనంతుని విగ్రహం, దీపాలు వెలగించనున్న అనంతుని మెట్లు
రేపు మెట్లపై వెలుగు దివ్వెల కొలువు
పటిష్ట ఏర్పాట్లు
దీపోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెట్ల కిరువైపులా ఉన్న తుప్పలు, డొంకలు తొలగించారు, సున్నం వేశారు. దీపాలు వెలిగించేందుకు అవసరమయ్యే నూనె, 5 వేల ప్రమిదలు, 6 వేల వత్తులు సమకూర్చారు.
కనులకింపుగా బొమ్మలు
వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరైన రూ.5 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మించారు. రోడ్డు పక్కన దాతలు ఎంపీపీ కంటుబోతు రాంబా బు, ఆపస్ జిల్లా అధ్యక్షుడు అవనాపు అరుణ్ కుమార్ ఆర్థిక సాయంతో వేసిన బొమ్మలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. శేషపాన్పుపై అనంత పద్మనాభ స్వామి, శంకు, చక్ర, నామాలు, శ్రీవారి పాదాలు చిత్రీకరించారు.
అనంతుని దీపోత్సవం
అనంతుని దీపోత్సవం


