రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట
చోడవరం: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖజిల్లా ప్రాంత క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఈనెల 15,16 తేదీల్లో కాకినాడలో రెండ్రోజుల పాటు రాష్ట్రస్థాయి స్థాయి తైక్వాండో క్యోరుగి, ఫూమ్‌సే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 28 మంది క్రీడాకారులు బంగారు పతకాలు, 8మంది రజత పతకాలు, 12 కాంస్య పతకాలు సాధించారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ పోటీల్లో విజయం సాధించారు. అత్యధికంగా చోడవరం ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పతకాలు సాధించారు. విజేతలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఏపీ తైక్వాండో అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు, కోచ్ పల్లం మురళి తెలిపారు. విజేతలను అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు అభినందించారు.


