హిందూపురంలో టీడీపీ మూకల దాడి హేయం
కె.కోటపాడు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ మూకల దాడి హేయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ తెలిపారు. సోమవారం కె.కోటపాడులో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంతోపాటు హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి ముమ్మూటికీ ఎమ్మెల్యే బాలకృష్ణదే బాధ్యతని స్పష్టం చేశారు. ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు రెచ్చిపోయి ఇటువంటి విధ్వంసాన్ని పాల్పడ్డారన్నారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హిందూపురంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనను చూసి జీర్ణించుకోలేక ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చోని తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని ఆరోపించారు. బాలకృష్ణ నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలే తప్ప ఇటువంటి దుశ్చర్యలు కాదని ఆమె హితవు పలికారు. సీఎం చంద్రబాబు చేతిలో పోలీసు వ్యవస్థ ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా ఇటువంటి దాడులు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ఈ తరహా చర్యలను విడనాడాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ


