డ్వాక్రా రుణాల స్వాహాపై ఆందోళన
మాడుగుల: మండలంలో అవురువాడ డ్వాక్రా గ్రూపు గిరి మహిళలు స్థానిక వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. అవురువాడ పంచాయతీకి చెందిన వెలుగు సిబ్బంది తమకు తెలియకుండా తమ పేరు మీద రుణాలు తీసుకున్నారని వాపోయారు. అవురువాడ పంచాయతీ శివారు కొండవీధి గ్రామంలో దుర్గాభవాని గ్రూపు, పెదగొరిగెడ్డ గ్రామంలో పోతురాజుబాబు, గంగతల్లి గ్రూపులు, సీతమందల గ్రామంలో దుర్గాదేవి, కూటికొండమ్మ తదితర 22 డ్వాక్రా గ్రూపుల పేరుతో రూ. 32 లక్షల రుణాలు తీసుకుని స్వాహా చేశారని, విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఆయా డ్వాక్రా గ్రూపు సభ్యులు ఎస్.లక్ష్మి, కె. దేవి, రాజులమ్మ, కె. బాలతల్లి, తదితరులు వెలుగు ఏపీఎం రమణికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు.


