అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇక్కడ విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎనుముల శ్రీనువాసరావు(44)గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


