పారిశ్రామికవేత్త?
సమ్మిట్‌లో ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు తహతహ బ్రిక్స్, టైల్స్, ఇతర వ్యాపారాల వారీగా జాబితా తయారు చేస్తున్న జిల్లా నేతలు గతంలో తమ పార్టీ నేతలతోనే ఎంవోయూలు చేసి భంగపడ్డ టీడీపీ ఇప్పుడు అదే తరహాలో కొత్త వారికి అవకాశం జాబితాల సేకరణలో నిమగ్నమైన నియోజకవర్గ స్థాయి నేతలు
మీలో ఎవరు
చోటా నేతలు, కార్యకర్తలకు టీడీపీ బంపర్ ఆఫర్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఒప్పందాల కోసం ఏర్పాట్లు
రండి బాబు.. రండి.. ఆలోచించిన ఆశాభంగం..
మంచితరుణం మించిన దొరకదు.. ఫైల్ పట్టుకుంటే.. పండగే..
ఒప్పందం కుదుర్చుకోండి.. భూములను దోచుకోండి.!
కండువా పక్కన పెట్టు.. కొత్త పరిశ్రమ పెడుతున్నట్లు నటించు..!
ఉన్న పరిశ్రమ చూపించి.. కొత్త రాయితీలు కొట్టెయ్యొచ్చు..!
ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల మాత్రమే.. అది కూడా ఈ నెల 14, 15 తేదీల్లోనే.! మీరు పచ్చనేత అయితే చాలు.. అర్హత పొందినట్లేనంటూ టీడీపీ నేతలు.. కొత్త సీసాలో పాత సారా పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం చేసిన హడావుడికి మరోసారి శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ నేతలకు ఇస్తున్న సరికొత్త బంపర్ ఆఫర్ ఏంటంటే..?
సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వం 2016, 2018లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ రెండు సదస్సుల్లోనూ లక్షల కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చేశాయంటూ ఊదరగొట్టారు. భారీ పరిశ్రమలు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి.. ఎంవోయూలు చేసుకున్నారంటూ ఒప్పందపత్రాలు మార్చుకుంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా చూస్తే.. లెక్కల్లోనే లక్షల కోట్లు మిగిలాయి.. ఫొటోలకే ఎంవోయూలు పరిమితమయ్యాయి. తర్వాత ఆరా తీస్తే.. టీడీపీ ప్రభుత్వం అసలు బండారం బట్టబయలైంది. సదస్సులకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో.. స్థానికంగా ఉన్న వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలకు సూటు, బూటు వేసి.. పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వందల కోట్ల రూపాయిల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చినట్లుగా ప్రకటించేసి.. అడ్డంగా దొరికిపోయారు. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్లుగా.. అబద్దాల పునాదులపై ప్రచారపటాటోపాలు నిర్వహిస్తూ.. ప్రజల సాక్షిగా అబాసుపాలవుతున్నా.. టీడీపీ మాత్రం తన వక్ర బుద్ధి వీడలేకపోతోంది. త్వరలో జరగబోయే సదస్సుకు కూడా ఇదే తరహాలో డమ్మీ పారిశ్రామికవేత్తల కోసం జాబితా తయారు చేస్తోంది.
పరిశ్రమ ఉంటే చాలు.. పనైపోద్ది.!
ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు అధిష్టానం టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారనే జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చోటా నేతలు, కార్యకర్తల్లో ఎవరైనా రెస్టారెంట్స్, హోటల్స్, బ్రిక్స్, టైల్స్ ఇలా.. చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నా.. వారితో పార్టనర్ షిప్‌సమ్మిట్‌లో కొత్తగా ఒప్పందాలు చేసుకునేలా ఏర్పాట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఆశించిన మేర పారిశ్రామికవేత్తలు రాకపోతే.. ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు టీడీపీ తహతహలాడుతోంది. అయితే.. 2018లో ఎంవోయూలు చేసుకున్న వారికి మాత్రం ఇందులో మినహాయింపునిస్తున్నారు. మళ్లీ వారినే పిలిపిస్తే.. పరువు పోతుందన్న భయంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచేంత పరిశ్రమ సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పడంతో.. ఆ తరహా పరిశ్రమలున్న వారి వివరాలు తయారుచేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్న సదస్సుకు జనం రాకపోతే.. నవ్వులపాలవుతామన్న భయంతో మరోసారి అదే దొడ్డిదారిలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
భూ పందేరం కోసం టీడీపీ నేతల కొత్త ఎత్తుగడలు!
సమ్మిట్ పేరుతో ఇదో యవ్వారం నడుస్తుండగా.. సందట్లో సడేమియాలా.. ఒప్పందాల పేరుతో భూ పందేరాలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూల పేరుతో ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి.. వాటిని అధికారికంగా కొట్టేసేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్న టూరిజం భూముల్లో పర్యాటక ప్రాజెక్టులు, ఏపీఐఐసీ భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సదస్సులో ఎంవోయూలు మార్చుకుంటూ.. తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తమ అనుచరగణంతో ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 241.92 ఎకరాల టూరిజం భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వందలాది ఎకరాలున్న ఏపీఐఐసీ భూములను వివిధ పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. మంచి ప్రాజెక్టులతో వస్తే భూ కేటాయింపులు రాయితీలతో ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇదే పేరుతో మొత్తం భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేందుకు సమ్మిట్ పేరుతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భాగస్వామ్య సదస్సు పేరుతో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం తెరతీయబోతోందనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి.


