పేట డైవర్షన్ రోడ్డుపై నుంచి రాకపోకలు ప్రారంభం
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం,నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో విజయరామారాజుపేట డైవర్షన్ రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మోంథా తుఫాన్‌కు విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. దీంతో పది రోజులుగా విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు, చోడవరం ప్రాంతాలకు తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. నెల రోజుల కిందట వర్షాలకు పేట డైవర్షన్ రోడ్డు దెబ్బతినగా అప్పట్లో అధికార్లు సిమెంట్ గొట్టాలు, గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేశారు. వేసిన రోడ్డు నెల రోజులు తిరగక ముందే వర్షాలకు మళ్లీ కోతకు గురైంది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేసి, బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం, 10.30కు 3వ, 11కు 4వ, 11.30కు 5వ, 12కు 1వ, 7వ, 12.30 గంటలకు 6వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించినప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు.


