తుఫాన్‌ సాయం కొందరికే..! | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ సాయం కొందరికే..!

Nov 5 2025 8:03 AM | Updated on Nov 5 2025 8:05 AM

నిత్యావసరాల పంపిణీలో తీవ్ర వివక్ష మత్స్యకారులు, నేత కార్మికులు మినహా

ప్రభుత్వం తీరుపై పలువురి ఆగ్రహం

మోంథా తుఫాన్‌ సహాయంలో కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. భారీ వర్షాలు, తుఫాన్‌ల కారణంగా నష్టపోయిన బాధితులకు సాయం అందించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వారం ఏర్పడ్డ మోంథా తుఫాన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, నేత కార్మికులతో పాటు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు ప్రభుత్వం 50 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో బంగాళ దుంపలు, కిలో ఉల్లిపాయలు గ్రామాల్లో రేషన్‌డిపోల ద్వారా మత్స్యకారులకు అందజేస్తోంది. అయితే మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో తూర్పు తీర ప్రాంతం వెంబడి 18 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 25 వేలకు పైగా మత్స్యకారులు జీవిస్తున్నారు. దాదాపు 1400కి పైగా బోట్లు తెప్పలు ఉన్నాయి. ఒక్కో తెప్పపై ఆరుగురు చొప్పున 8వేల మందికి పైగా మత్స్యకారులు వేటకు వెళ్తుంటారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేటపై ఆధార పడిన మహిళలు కూడా వివిధ గ్రామాల్లో చేపలు విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతుంటారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్‌ కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తుఫాను సాయం కింద ఈ బియ్యాన్ని నిత్యావసర సరుకులను అందజేస్తోంది. ఇలా నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో మత్స్య కారులు, చేనేత కార్మికులు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులను 13,681 మందిని గుర్తించారు. వీరికి మాత్రమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తోంది. మత్య్సకార గ్రామాల్లో కేవలం మత్స్యకారులే కాకుండా రజకులు, శెట్టి బలిజ, దళితులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, కాపులు, వెలమ తదితర వెనుకబడిన సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. రేషన్‌ కార్డు కలిగిన ఇలాంటి వారు మరో 30వేల మందికి పైనే ఉంటారు. వీరెవరికీ రేషన్‌ బియ్యం, ఇతరత్రా సరుకులు అందించలేదు. తుఫాన్‌ వల్ల తాము కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయామని కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండిపోయామని, మత్స్యకారులతోపాటు, తాము కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలపాకు, అపరాలు, కూరగాయలు, ఉద్యానవన రైతులకు కూడా ఎంతో నష్టం వాటిల్లింది. వీరెవరికీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించలేదు. తమ గ్రామాల్లో ఇతర సామాజిక వర్గాల వారు కూడా నివసిస్తున్నారని, తుఫాన్‌ కారణంగా వారు కూడా ఎంతో నష్టపోయినా వారికి ప్రభుత్వం సాయం అందించకపోవడం సమంజసం కాదని మత్స్యకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. తమతోపాటు మిగిలిన బాధితులకూ తుఫాన్‌ సాయం కింద నిత్యావసరాలు అందించాలని రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. చేతివృత్తులపై ఆధారపడ్డ రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, శెట్టిబలిజ, గుల్ల కార్మికులు, దళితులకు సాయం అందించకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. తుఫాన్‌ సాయంలో కూడా కూటమి ప్రభుత్వం వివక్ష చూపడం పట్ల బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.

గత ప్రభుత్వంలో వివక్ష లేదు..

గత ప్రభుత్వంలో తుఫానులు సంభవించినప్పుడు కులాల వారీగా కాకుండా తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్‌కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తరపున సహాయం పంపిణీ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఏడాదిపాటు బాధితులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. తుఫాన్‌ సాయంలో ఎటువంటి వివక్ష లేకుండా, అన్ని సామాజిక వర్గాల వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, మత్స్యకార సామాజిక వర్గాలవారు సైతం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

మా గోడు పట్టదా...

మేము కూడా మత్స్యకార గ్రామంలోనే నివసిస్తున్నాం. తుఫాను వల్ల మేము కూడా ఉపాధి కోల్పోయాం. కల్లుగీత, తాటాకులు అమ్ముకోవడం, వ్యవసాయ కూలి పనులకు వెళ్తుంటాం. వారం రోజుల పాటు గడప దాటలేదు. తుఫాను ప్రభావం కారణంగా మత్య్సకారులు మినహా ఇతర కులాల వారికి నిత్యావసరాలు ఇవ్వకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా సరుకులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం మాపై వివక్ష చూపించడం దారుణం. మేమేం పాపం చేశాం..

–చిట్టిమని రాంబాబు, అమలాపురం

దళితులను విస్మరించడం సరికాదు..

తుఫాన్‌ వల్ల కేవలం ఒక వర్గం వారే నష్టపోయారని భావించడం తగదు. దళితులు కూడా నష్టపోయారు. వారం రోజుల పాటు కూలి పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు సాయం చేయకపోవడం బాధగా ఉంది. ప్రభుత్వం స్పందించి రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి తుఫాన్‌ సాయాన్ని అందించాలి.

–కుంచా సురేష్‌, జగన్నాథపురం

మిగిలిన సామాజికవర్గాలకు మొండి చేయి

తుఫాన్‌ సాయం కొందరికే..! 1
1/2

తుఫాన్‌ సాయం కొందరికే..!

తుఫాన్‌ సాయం కొందరికే..! 2
2/2

తుఫాన్‌ సాయం కొందరికే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement