ఇదేం వివక్ష!
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
చీడికాడ: మోంఽఽథా తుఫాన్ పరిహారం పంపిణీలో వివక్ష తగదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ స్టేట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం ఆయన కోనాం శివారు గిరిజన గ్రామం గుడివాడను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు బుచ్చయమ్మ, దేముడమ్మ, రాజులమ్మ తదితరులు బూడి వద్దకు వచ్చి తమ గోడు వినిపించారు. మోంథా తుఫాన్‌లో తమ ఇల్లు దెబ్బతిన్నా తమకు తక్షణ సహకారం అందించకుండా ఒక వర్గానికి చెందిన వారికే నిత్యావసర వస్తువులు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బూడి తహసీల్దార్ కిషోర్ లింకన్‌ను ఫోన్‌లో సంప్రదించి మరోమారు కోనాం, వి.బి.పేట పంచాయతీలోని అన్ని గిరిజన గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలు, కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అందించారన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి కానరాలేదన్నారు. తుఫాన్ ధాటికి ఇళ్లు దెబ్బతిని తమ ఆస్తులు నష్టపోయిన వారికి మనవత్వంతో ఆదుకోవాల్సింది పోయి కొందరికే పరిహారం అందించడం తగదన్నారు. రేషన్ సరఫరా వాహనాలను రద్దు చేయయడంతో 6 కిలోమీటర్లు దూరంలో గల కోనాం రేషన్ డిపోకి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితి గిరిజనులకు కల్పించారన్నారు. వెంటనే ఆయా గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని మరోసారి పరిశీలించి బాధితులు అందరికీ న్యాయం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణమూర్తి, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు కిముడు చిన్నమ్మలు, ధర్మిశెట్టి స్వాతి తదితరులున్నారు.


