ఒకేరోజు పంచారామాల సందర్శన
కార్తీకం ‘స్పెషల్’
సాక్షి, అనకాపల్లి: పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు యాత్రకు వెళుతున్నారు. ప్రతి ఏటా వీరి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. దీంతో భక్తుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా బస్సులను స్పెషల్ దర్శనానికి రవాణా చేశారు. ప్రైవేట్ సర్వీస్‌లు కన్నా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులలోనే భక్తులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే మూడేళ్లుగా ఆర్‌టీసీ కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడిపింది. దానికి తగ్గట్లుగానే భక్తులు కూడా బస్‌లను బుక్ చేసుకుంటున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణంతో ఈ ఏడాది పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు బిజీగా ఉండడంతో..ఆల్ట్రా డీలక్స్ బస్సులనే శైవక్షేత్రాల ప్రత్యేక యాత్రకు కేటాయించారు. ఇందుకోసం శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం పంచరామాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పా టు చేసింది.
ఇప్పటికే అక్టోబర్ 28వ తేదీన, నవంబర్ 2వ తేదీన రెండు దఫాలుగా సర్వీసులను నడిపారు. ఈ సర్వీసులను కార్తీక మాసం మొత్తం నడిపేందుకు ఆర్‌టీసీ సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్ 9, 11వ తేదీల్లో కూడా ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను నడుపుతుంది. ఈ ప్యాకేజీలతోపాటు వన భోజనాలు, ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా ప్రకటించారు.
ఆన్‌లైన్‌లో, డిపో కౌంటర్లలో టికెట్లు
కార్తీక మాసంలో ఒకే రోజు పంచారామాల క్షేత్ర దర్శనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందుకు తగ్గట్లుగానే ఆర్‌టీసీ కూడా బస్సు సర్వీసులను నడుపుతుంది. ప్రతి ఆదివారం అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి బస్సులు బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి సోమవారం రాత్రి మళ్లీ ఆయా డిపోలకు చేరుకుంటాయి. టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో, డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉచిత బస్సుతో తగ్గిన సర్వీసులు..
కార్తీక మాసంలో పంచారామాల శైవ క్షేత్రాల యాత్రకు ఎక్కవగా బస్సులను ఆర్‌టీసీ నడిపేది. ఇప్పుడు ఉచిత బస్సు పథకంతో ఆర్‌టీసీ బస్సులు కొరత రావడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను మాత్రమే నడుపుతుంది. మూడేళ్లగా ఈ శైవక్షేత్రాల యాత్రకు భక్తులకు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా ఎక్స్‌ప్రెస్ బస్సులను నడిపేది. కానీ ఈ ఏడాది ఈ బస్సులన్నీ రద్దీగా ఉండడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులనే నడుపుతుంది. దీంతో ఆర్‌టీసీకి ఆదాయం తగ్గుముఖం పట్టింది. కార్తీక మాసంలోనే ఎక్కువగా ఆర్‌టీసీలకు లాభం వచ్చేది..ఈ ఏడాది అది కాస్త తగ్గిందని ఆర్‌టీసీ అధికారులు సైతం చెబుతున్నారు.
ప్రతి ఆదివారం స్పెషల్..
వచ్చే ఆదివారం 09 వ తేదీ, 16వ తేదీల్లో అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి పంచరామాల పుణ్యక్షేత్రాలకు ఆల్ట్రా డీలక్స్ బస్సులు బయలుదేరుతున్నాయి. ముందుగా టికెట్స్ బుక్ చేసుకోనే భక్తులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్లలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే అనకాపల్లి డిపో సెల్‌నంబర్ 7382913967, నర్సీపట్నం డిపో సెల్ నంబర్ 9494811855లను సంప్రదించాలి.
–వి.ప్రవీణ, ప్రజారవాణా శాఖ జిల్లా అధికారి
అనకాపల్లి డిపో నుంచి..
ఒకేరోజు పంచారామాల సందర్శన


