దేవాలయాలు, స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు
తుమ్మపాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న శివాలయాలు, ప్రముఖ దేవాలయాలు, స్నానఘట్టాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి రెవెన్యూ, దేవదాయశాఖ, పోలీసు, వైద్యశాఖ, ఎంపీడీవోలతో దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. దేవాలయాల్లో ప్రజల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లకు బారికేడ్లు, మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర, నదీ స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధం చేసుకోవాలని, మహిళలు బట్టలు మార్చుకోవడానికి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన వివరాలు తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు తీసుకుని వారితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని తగినంత భద్రతా ఏర్పాట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాంబిల్లి మండలం పంచదార్ల, అనకాపల్లి మండలం సత్యనారాయణస్వామి గిరి ప్రదక్షిణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, మంచినీరు, ప్రతి మూడు కిలోమీటర్లకు వైద్య శిబిరం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ దేవాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటుకు దేవదాయ శాఖ నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖకు అందిస్తున్నారని, దానికి తగినట్టుగా పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం రావడం లేదన్నారు. ప్రతి దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి దేవాలయానికి ప్రవేశ, నిష్క్రమ మార్గాలు విడిగా ఉండాలని, నిష్క్రమణ మార్గాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. భోజనం, ప్రసాదం కౌంటర్లు తగినన్ని ఏర్పాటు చేయాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా ఎండోమెంటు అధికారి కె.ఎల్. సుధారాణి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు పాల్గొన్నారు.


