రాంబిల్లి ఫణిగిరి గిరి ప్రదక్షిణ నేడే
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కొలువు ఉన్న ఫణిగిరి ప్రదక్షిణ ఈనెల 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో 24 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున చేపట్టనున్నారు. బుధవారం తెల్లవారుజామున భక్తులు ధార భోగాపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ధారపాలెం, పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడక పాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల చోడపల్లి, అచ్యుతాపురం, వెదురువాడ, గొర్ల ధర్మవరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధా మాధవ స్వామి ఆలయానికి యాత్ర చేరుకోనుంది అనంతరం ఆకాశధారలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉమా ధర్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే స్వామివారికి అవసరమైన గొడుగుకు నిధులను దాతలు సమకూర్చారు. 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భక్తులు నడిచేందుకు వీలుగా రహదారులను చదును చేసే పనులు చేపట్టారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల వైద్య సేవల నిమిత్తం అచ్యుతాపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు మూడు చోట్ల వైద్య శిబిరాలను, అంబులెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతోంది.


