భక్తిశ్రద్ధలతో ఫణిగిరి ప్రదక్షిణ
ఘనంగా ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఊరేగింపు
మార్మోగిన శివ నామస్మరణ
భక్తులకు అల్పాహారం అందించిన స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు
రాంబిల్లి(అచ్యుతాపురం): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాంబిల్లిలో ఫణిగిరి ప్రదక్షిణను బుధవారం ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ కొండపై వెలసిన ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. తెల్లవారు జామున ధారపాలెం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ 24 కిలో మీటర్ల మేర సాగింది. శివనామ స్మరణ చేస్తూ వందలాది మంది భక్తులు నడక సాగించారు. చిన్నాపెద్దా, ముసలిముతక అన్న తేడా లేకుండా.. ఒకవైపు కాళ్లు కాలుతున్నప్పటికీ మండుటెండను లెక్కచేయకుండా భక్తి పారవశ్యంతో భారీ ఎత్తున ప్రదక్షిణలో పాల్గొన్నారు.
భక్తుల సేవలో...
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మార్గ మధ్యంలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సేవలందించారు. మజ్జిగ, అల్పాహారం అందజేశారు. పలు కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, భక్తులకు చికిత్స చేశారు. గిరి ప్రదక్షిణ సాగిన ప్రాంతాల్లో రహదారిని చదును చేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. అప్పారాయుడిపాలెం జంక్షన్, కొత్తూ రు, గోకివాడ, మూలజంప, మూల కొత్తూరు, మడకపాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఎర్రవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి, అచ్యుతాపురం జంక్షన్, వెదురువాడ, గొర్లె ధర్మ వరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధామాధవ స్వామి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. భక్తులు ఆకాశ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో ఫణిగిరి ప్రదక్షిణ


