సహకారం పక్కదారి
డీసీసీబీకి అవినీతి మరకలు
పదోన్నతుల్లో అక్రమాల మంటలు
నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌పైనే ఆరోపణలు
బ్యాంకులో అవినీతిపై విచారణ చేయాలని ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదులు
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
పదోన్నతులపై దుమారం
గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం.
రూ.30 లక్షలు దుర్వినియోగం?
గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్‌లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్‌టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్‌టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్‌లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్‌ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు.
రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం
తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్‌గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు.


