 
															క‘న్నీళ్లు’కు పొర్లు కట్టు
ఓ మోస్తరు వర్షం పడినా వారు చివురుటాకులా వణికిపోయే వారు...తుఫాన్లు వస్తే వారి అవస్థలు చెప్పనలవికాదు... నాలుగు వైపుల నుంచి నీరు ముంచెత్తడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యేవారు... పునరావాస కేంద్రాలకు పరుగులు తీసేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఇంత పెద్ద మోంథా తుఫాన్ సమయంలో కూడా వారు హాయిగా ఇళ్లలోనే ఉన్నారు. దీనికి కారణంగా గత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేసిన మేలేనని ఆ గ్రామస్తులు చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు.
నాతవరం: మండలంలో వై.బి.ఆగ్రహారం మారుమూల గ్రామం. ఈ గ్రామానికి ఒకవైపు నిత్యం నీటితో నిండుగా ఉండే ఊర చెరువు, మరో పక్క కొండ గెడ్డ ఉన్నాయి. ఈ రెండే కాకుండా ఇంకో పక్క ఎగువ ప్రాంతంలో ఏలేరు కాలువ, వెర్రిగెడ్డ ఉన్నాయి. భారీ వర్షం పడినప్పుడు, తుఫాన్ల సమయంలో వీటి నీరంతా గ్రామంలోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. తుఫాన్ల హెచ్చరికల సమయంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. అలాంటిది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వీరి సుదీర్ఘ సమస్యకు మోక్షం కల్పించారు. గ్రామ సర్పంచ్ కొసూరి విజయ ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి నీటి ముంపు సమస్యపై ఉమా శంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా రూ. 9 లక్షలతో పోర్లు కట్టు నిర్మించారు. తర్వాత గ్రామానికి ఎత్తులో ప్రవహించే కొండ గెడ్డ నీరు బయటకు పొర్లకుండా ఉండేందుకు పూడికతీత పనులు చేయించారు. ఖరీఫ్ ముందు కూడా ఈ పనులు చేశారు. మోంథా తుఫాన్ సమయంలో కూడా ఊర చెరువు, కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలో తుఫాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు బావుల్లో తాగునీరు కలుషితమై గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి ఆ సమస్య ఉత్పన్నం కాలేదు.
ఏళ్లనాటి సమస్య పరిష్కరించారు
తుఫాన్ల సమయంలో గ్రామాన్ని ఎప్పుడు గెడ్డల నీరు ముంచెత్తుతుందోనని భయంతో గడిపేవాళ్లం. ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పోర్లుకట్టు నిర్మించి, చెరువును అభివృద్ధి చేశారు. అదే విధంగా కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాకుండా తాండవ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి పూడిక తీత పనులు చే యించారు. దీంతో మోంథా తుఫాన్ సమయంలో మా గ్రామంలోకి నీరు రాలేదు. అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా...వాటి అవసరం లేకపోయింది.
– కోసూరి విజయ,
గ్రామ సర్పంచ్ వై,బి,ఆగ్రహరం
గత ఎమ్మెల్యే గణేష్ హయాంలో
వై.బి.అగ్రహారంలో పొర్లుకట్టు నిర్మాణం
దీంతో మోంథా సమయంలో తప్పిన ముప్పు
నీటి ముంపు లేకుండా చేసిన గత
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
 
							క‘న్నీళ్లు’కు పొర్లు కట్టు
 
							క‘న్నీళ్లు’కు పొర్లు కట్టు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
