 
															ముడసర్లోవకు జలకళ
ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. రిజర్వాయర్ చుట్టూ కంబాలకొండలు, సింహాచలం కొండలు ఉన్నాయి. మోంథా తుపాను వర్షాల వల్ల ఈ కొండల నుంచి రిజర్వాయర్‌లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. తుపానుకు ముందు రిజర్వాయర్‌లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరింది. సాధారణంగా ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 170 అడుగులు. దీనిని ఓవర్‌ఫ్లో చేయడానికి మరో 5.4 అడుగుల నీరు మాత్రమే అవసరం. తుపాను ప్రభావంతో ఎక్కువ మొత్తంలో కొత్త నీరు చేరడంతో, ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.
మోంథా తుపానుతో పెరిగిన నీటి మట్టం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
