
మూడో విడత రీసర్వేకు 30 గ్రామాల గుర్తింపు
నాతవరం: జిల్లాలో భూ రీసర్వే చేయడానికి మూడో విడతలో 30 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని సర్వే ఏడీ గోపాలరాజు చెప్పారు. ఆయన గురువారం రాజుపేట అగ్రహారం గ్రామంలో రీసర్వేను పరిశీలించారు. ఈ గ్రామంలో ఇంతవరకు చేసిన రీసర్వేపై రైతులతో మాట్లాడారు, అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక రెవెన్యూ గ్రామం చొప్పున 24 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు. రెండో విడతలో 30 గ్రామాల్లో రీసర్వే చేపట్టామని, ఈనెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. మూడో విడతలో రీసర్వేకు ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో ముందుగా తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్, నర్సీపట్నం డివిజన్ సర్వే ఇన్‌స్పెక్టర్ ఎల్.బంగారుదేవి, మండల సర్వేయరు సత్యనారాయణ, ఆర్‌ఐ నాగరాజు, సచివాలయ సర్వేయరు విజయకుమార్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.