ఏయూ పరువు పాయే..! | - | Sakshi
Sakshi News home page

ఏయూ పరువు పాయే..!

Oct 17 2025 6:34 AM | Updated on Oct 17 2025 6:34 AM

ఏయూ పరువు పాయే..!

ఏయూ పరువు పాయే..!

వైస్‌చాన్స్‌లర్‌కు అవమానం..! బాణసంచా దుకాణాల అనుమతుల విషయంలో విచిత్రం ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యా శాఖ జోక్యం అనుమతులు ఇవ్వాలంటూ ఏయూ వీసీకి లేఖ రాయడంపై చర్చ ఏయూ వీసీ పరువు తీశారంటూ వర్సిటీలో దుమారం

అనుమతులకు ముందే పనుల ప్రారంభంపై ‘సాక్షి’ కథనంతో ప్రకంపనలు

ఉలిక్కిపడిన యంత్రాంగం.. కలెక్టర్‌ సీరియస్‌

హెలిప్యాడ్‌ గ్రౌండ్‌ నుంచి పార్కింగ్‌ గ్రౌండ్‌కు వేదిక మార్పు

విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ మరో వివాదం రాజుకుంటోంది. ఏయూలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం అగ్గి రాజేస్తోంది. ఏయూ వీసీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక స్టాళ్ల అనుమతులకు ఉన్నత విద్యా శాఖ లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది వైస్‌ చాన్సలర్‌ పరువు తీయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం విశ్వవిద్యాలయ అధికార, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కల్పించుకోవడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏయూ నుంచి అనుమతులు రాకముందే స్టాళ్ల ఏర్పాటు పనులు చేపట్టడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో అధికార వర్గాల్లో ప్రకంపనలు రేగాయి. దీనిపై కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం.

ఉన్నత విద్యా శాఖ జోక్యంపై చర్చ

సాధారణంగా ఏయూలో కార్యక్రమాల నిర్వహణకు ఏయూ సమావేశ మందిరాలు, మైదానాలు లీజుకు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. ఎవరైనా కార్యక్రమం నిర్వహణకు దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుము చెల్లిస్తే.. ఏయూ వీసీ అనుమతులు ఇస్తుంటారు. గతంలో ప్రైవేటు కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చేవారు. అయితే ఏయూ రాజకీయ వేదికగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు కార్యక్రమానికి ఏయూ, దానికి సంబంధించిన మైదానాల్లో అనుమతులు మంజూరు చేసే అవకాశం లేదు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో స్టాళ్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. దీనిపై ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌ గ్రౌండ్‌ను లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్‌ స్వయంగా ఏయూ వీసికి లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ నిర్ణయం తీసుకోకముందే పనులు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ అనుమతుల విషయంలో నేరుగా ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం ఇపుడు వర్సటీలో చర్చకు దారితీసింది. ఏయూ వీసీ నిర్ణయం తీసుకోవాల్సిన్న సర్వసాధారణ విషయంలో రాష్ట్ర హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఏయూ వీసీని అవమానించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

21వ తేదీ వరకు అనుమతులు

కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్‌ హెలీప్యాడ్‌ గ్రౌండ్‌ లేదా దాని ఎదురుగా ఉన్న పార్కింగ్‌ మైదానాన్ని తాత్కాలిక స్టాళ్ల ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి ఏయూ వీసీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌కు లేఖ వచ్చింది. ఈ నెల 15న ఈ లేఖ రాగా వెంటనే ఏయూ వీసీ కూడా అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కానీ 14వ తేదీ నుంచి అనుమతులు కోరినట్లు ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆయన అనుమతులకు ముందే ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ పార్కింగ్‌ మైదానంలో మళ్లీ పనులు ప్రారంభించేయడం విషయం. ప్రస్తుతం అనుమతులు ఉండడంతో పనులు జరుగుతున్నాయి.

‘కూటమి’ జోక్యంతో వివాదం

ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ హెలిప్యాడ్‌ మైదానంలో స్టాళ్ల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ రాజశేఖర్‌కు లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇవ్వకముందే గ్రౌండ్‌లో స్టాళ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీనిపై సాక్షి ‘ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్‌ ఫైర్‌’ అంటూ కథనం ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఏ శాఖ నుంచి అనుమతులు రాకముందే, ఏయూ వీసీ గ్రౌండ్‌ను లీజుకు ఇవ్వకముందే పనులు చేపట్టడంపై కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సీరియస్‌ అయ్యారు. వెంటనే ఆ పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కూటమి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. జిల్లా అధికారులతో పాటు ఏయూ వీసీతో కూడా మాట్లాడి అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది.

సదరు ప్రజాప్రతినిధి అనుచరులే ఈ మందుగుండు స్టాళ్ల పేరుతో దందాకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో స్టాల్‌ను రూ.1.5 లక్షలకు బేరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏయూ గ్రౌండ్‌లో దుకాణాలను ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధి గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement