
25లోగా ఈ–పంట నమోదు
● ధాన్యం సేకరణకు 63 కేంద్రాల ఏర్పాటు
● బాణసంచా కేంద్రాల్లో
భద్రతా ప్రమాణాలు తనిఖీ చేయాలి
● జాయింటు కలెక్టర్ జాహ్నవి ఆదేశం
తుమ్మపాల: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సాగుపై ఈ–పంట వివరాలు నమోదు ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరం నుంచి బుధవారం మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణకు జిల్లాలో 63 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకం చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అవసరమైన ఇంటి స్థలాలను ప్రస్తుత లేఅవుట్లలో ఖాళీల్లో భర్తీ చేయాలన్నారు. అదనంగా భూమి అవసరమైతే అందుబాటులో నివాసానికి అనుకూలమైన ప్రభుత్వ భూమిని గుర్తించి సేకరించాలన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేయుటకు సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను డివిజను, మండల స్థాయిలో సీసీఎల్‌ఏ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం రిజిస్టరు చేయాలన్నారు. తిరస్కరించే అర్జీలకు అందుకు గల కారణాన్ని అర్జీదారునికి అందజేయాలన్నారు. మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా క్రయవిక్రయాలు పెరుగుతాయని, తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలన్నారు. ఓటర్ జాబితాపై ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేసిన పిదప, ప్రతి ఓటరు మ్యాపింగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు పి.జయంతి, కలెక్టరు కార్యాలయ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పార్టనర్‌షిప్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ –2025 సందర్భంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖలో వివిధ అంశాలపై నెల రోజుల పాటు నిర్వహించే ‘‘ఏపీఐఐసీ – పార్టనర్‌షిప్ డ్రైవ్ ’’ పోస్టర్‌ను జేసీ ఎం. జాహ్నవి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజరు ఎస్. నరశింహరావు, డీజెడ్‌ఎం సూర్యనారాయణ, జనరల్ మేనేజరు ప్రసాదు పాల్గొన్నారు.