● అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయ ఏవో రాముకు అభినందన
అనకాపల్లి: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఏవో డి. రాము అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఓపెన్ కేటగిరీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. హాంకాంగ్‌లో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకూ ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 120 కేజీల మాస్టర్స్ విభాగంలో పాల్గొని 125 కేజీలు బెంజ్‌ప్రెస్ ఎత్తి సత్తా చాటాడు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో రామును ఎంపీపీ గొర్లి సూరిబాబు శాలువాలతో సత్కరించారు. ఎంపీపీ మాట్లాడుతూ రాము ప్రతిభ స్ఫూర్తిదాయకమన్నారు. ఉద్యోగ నిర్వహణ చేస్తూ క్రీడల్లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకొచ్చారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.