
పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
దేవరాపల్లి: దేవరాపల్లి–అనకాపల్లి రోడ్డులో సంజీవమెట్ట సమీపంలో సోమవారం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. దేవరాపల్లి నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంజీవమెట్ట దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొల్లాలోకి దూసుకుపోయి మట్టిలో కూరుకుపోయింది. ఈ సమయంలో ఆర్టీసీ బస్సులో 15 మందికి పైగా ప్రయాణికులు ఉండగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వారందరినీ వేరొక బస్సులో ఎక్కించి పంపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు కొందరు మట్టి తవ్వి రోడ్డు పక్కన కుప్పగా వేయడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పించుకునే క్రమంలో ఈ మట్టి దిబ్బలతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలను తక్షణమే తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.