
గెడ్డ, పోరంబోకు భూమి స్వాధీనం
ఆక్రమిత స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్
భూమిలో నాటిన మొక్కల తొలగింపు
మాకవరపాలెం: ఆక్రమణలో ఉన్న గెడ్డ, పోరంబోకు భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని తామరం రెవెన్యూలోగల 61/3లోని సుమారు 20 ఎకరాల గెడ్డ, పోరంబోకు భూమి ఆక్రమణపై సోమవారం సాక్షి పత్రికలో ‘పచ్చనేత.. భూముల మేత’ శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ వెంకటరమణ స్పందించారు. సిబ్బందితో కలిసి గెడ్డ, పోరంబోకు భూమిని పరిశీలించారు. ఇప్పటికే ఈ భూమిలో నాటిన మొక్కలను పూర్తిగా తొలగించారు. ఈ మొక్కలను దగ్గరుండి నాటించిన టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడి సోదరుడు రుత్తల రమణమూర్తిని తహసీల్దార్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గెడ్డ, పోరంబోకు భూములను ఆక్రమించడం నేరమన్నారు. ఇకపై ఈ భూమిలో మొక్కలు నాటడం, కట్టడాలు నిర్మించడం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఈ భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఐ చక్రపాణి, సిబ్బంది ఉన్నారు.
20 కాదు.. 8 ఎకరాలే..
తామరం గెడ్డ, పోరంబోకు భూమిలో మొక్కలు నాటడంలో తన ప్రమేయం లేదని రాచపల్లి ఎంపీటీసీ, టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడు సాక్షికి తెలిపారు. 61/3 సర్వే నంబర్‌లో ఉన్న 21.63 ఎకరాల్లో తనకు 8 ఎకరాలు వారసత్వంగా వచ్చిందన్నారు. 2013లో రెవెన్యూ అధికారులు తనపై పెట్టిన కేసులు కోర్టులో ఉన్నట్టు చెప్పారు.

గెడ్డ, పోరంబోకు భూమి స్వాధీనం