
30వ రోజుకు చేరిన రాజయ్యపేట దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని కోరుతూ రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరాహారదీక్ష సోమవారం 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం జాతీయరహదారిని దిగ్బంధించి నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్న మత్స్యకారులు.. బుధవారం సమావేశం నిర్వహిస్తామన్న కలెక్టర్ హామీతో శాంతించిన విషయం తెలిసిందే. వారు సోమవారం నూకతాత ఆలయం వద్ద రిలే దీక్ష కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సిటు జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. వీసం రామకృష్ణ మాట్లాడుతూ పోలీసులు అతిగా ప్రవర్తించి ఆంక్షలు విధించడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఉద్యమం ఉధృతమయిందన్నారు. ప్రారంభంలోనే ప్రభుత్వం మత్స్యకారులతో చర్చలు జరిపి ఉంటే బాగుండేదన్నారు. 30 రోజులుగా దీక్ష చేస్తున్న మత్స్యకారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదన్నారు. అయినప్పటికీ పోలీసుల కవ్వింపు చర్యలతో కడుపు మండిన మత్స్యకారులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కలిగిందన్నారు. ఈ ధర్నాలో జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు, మహేష్, సోమేష్, నారాయణరావు, బైరాగి రాజు, పిక్కితాతీలు, మైలపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.