
సీఐ కుమారస్వామిపై బదిలీ వేటు
నక్కపల్లి: స్థానిక సీఐ కుమారస్వామిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఆయన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనను వీఆర్‌కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు ఆదివారం జాతీయ రహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు రాకపోకలు స్తంభింపజేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని మత్స్యకారులు భీష్మించారు. ఎట్టకేలకు కలెక్టర్, ఎస్పీ వచ్చి మత్స్యకారులను శాంతింపజేయాల్సివచ్చింది. దీనికితోడు 15 రోజుల క్రితం మత్స్యకారుల డిమాండ్ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత రాజయ్యపేట వెళ్లారు. ఈ సందర్భంలో ఆమె తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. మంత్రి వాహనాలకు అడ్డంగా కొబ్బరి, తాటి చెట్లు పడేసి కాన్వాయ్ కదలకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. హోంమంత్రిని ఈ స్థాయిలో మత్స్యకారులు అడ్డుకుంటారన్న విషయాన్ని ముందుగానే స్థానిక పోలీసులు పసిగట్టకపోవడాన్ని కూడా ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. అప్పట్లోనే స్థానిక సీఐ వైఫల్యం ఉందని, ఆయనపై బదిలీ వేటు తప్పదన్న ప్రచారం జరిగింది. ఆదివారం వేలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం కూడా సీఐకు ప్రతికూలంగా మారింది. నిజానికి విశాఖ నగర పోలీసుల చర్యలే ఈ ఆందోళన తీవ్రతకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. మత్స్యకారులకు మద్దతుగా కోర్టు అనుమతితో రాజయ్యపేట వస్తున్న బీసీవై పార్టీ అధినేత బి.రామచంద్రయాదవ్‌ను విశాఖలో పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రాజమండ్రిలో కూడా ఇలాగే జరిగింది. ఆదివారం విశాఖలో అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న మత్స్యకారులంతా అడ్డగింతలు, గృహ నిర్బంధాలపై తాడోపేడో తేల్చుకునేందుకు జాతీయ రహదారిని ముట్టడించారు. ఏది ఏమైనప్పటికీ కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్టు కుమారస్వామి బదిలీకి పలు అంశాలు దోహదపడ్డాయి. నక్కపల్లి కొత్త సీఐగా షేక్ గఫూర్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నారు.