
ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ
నవంబరు నుంచి బయోమెట్రిక్: కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఉపాధి హామీ వేతనదారులకు నవంబరు నెల నుంచి ముఖ అధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని, అందుకు తగ్గట్లుగా వేతనదారులకు అవసరమైన ఈ–కేవైసీ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. ప్రతి మండలానికి ఒక మేజిక్ డ్రెయిన్ పూర్తి చేయాలని, లక్ష్యం మేరకు ఉపాధి హామీ పథకం కూలీలను సమీకరించాలని, వారికి కనీస వేతనం అందేలా పనులు కల్పించాలన్నారు. మండలాలకు మంజూరు చేసిన నీటి కుంటలు, పశువుల షెడ్ల పనులు మొదలు పెట్టి పూర్తిచేయాలన్నారు. పాయకరావుపేట మండలం నామవరం గ్రామం లే అవుట్‌లో గృహప్రవేశాలు నిర్వహిస్తామని, లే అవుట్‌లో మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, డీపీవో సందీప్ ఇతర అధికారులు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.