
కె.జె.పురం తాచేరు వంతెన వద్ద కూలిన కల్వర్టు
భారీ వాహనాలు తిరగడమే కారణం
మాడుగుల రూరల్: మండలంలో కె.జె.పురం తాచేరు వంతెన పక్కన గల కల్వర్టు సోమవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ కల్వర్టు మీదుగా 50 రోజులపాటు బస్సులు, ఇతర పెద్ద వాహనాలు తిరగడమే కల్వర్టు కూలిపోవడానికి కారణమని స్థానిక ప్రజలు వాపోతున్నారు. విజయరామరాజుపేట బొడ్డేరు నది మీద కాజ్‌వే ఆగస్టు మాసంలో కొట్టుకొని పోవడంతో పాడేరు, మాడుగుల నుంచి చోడవరం, విశాఖ, అనకాపల్లి వెళ్లే బస్సులను కె.జె.పురం గ్రామం మీదుగా నడిపారు. ఈ కల్వర్టు బలహీనంగా ఉందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉందని సాక్షిలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. భారీ వాహనాలు నడిపేటప్పుడు కల్వర్టుకు చిన్న రంధ్రం ఏర్పడటంతో తాత్కాలికంగా స్థానికులు మట్టితో కప్పారు. అయితే సోమవారం సాయంత్రం కల్వర్టు కూలిపోవడంతో ఈ రహదారి గుండా ఆటోలు, ఇతర పెద్ద వాహనాలు తిరిగే అవకాశం లేదని, ఈ దృష్ట్యా చోడవరం, నుంచి గ్రామానికి వచ్చే వాహనాలను వంటర్లపాలెం గ్రామం మీదుగా నడపాలని స్థానికులు వాహనదార్లకు విజ్జప్తి చేశారు. కల్వర్టు కూలిపోవడంతో చోడవరం, మాడుగుల, తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. వీరు వంటర్లపాలెం మీదుగా వచ్చారు. ఆర్ అండ్ బి అధికారులు యుద్ధప్రాతిపదిక మీద కల్వర్టు పనులు పూర్తి చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.