
దోమల లార్వా నివారణకు గంబూషియా చేపలు
తుమ్మపాల: దోమల లార్వాను తినే గంబూషియా చేపలతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని నీటి కొలనుల్లో ఆయన గంబూషియా చేపలను వదిలారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు, కొలనులు, బావులలో లక్షా 30 వేల గంబూషియా చేపలను విడుదల చేశామన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్మూలనలో యాంటీ లార్వా ఆపరేషన్ కీలకమని, గంబూషియా చేపలు ఈ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు జీవించి, దోమల లార్వాలను పూర్తిగా తినేస్తాయన్నారు. ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయంత్రం వేళల్లో వేపాకు పొగ వేయడం, దోమతెరలు వాడడం వంటి చర్యలు దోమకాటుకు నిరోధంగా ఉపయోగపడతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్‌సీని సందర్శించాలన్నారు. డీపీవో సందీప్, సీపీవో రామారావు, జిల్లా మలేరియా అధికారి వరహాల దొర తదితరులు పాల్గొన్నారు.