
లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి
● మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలి
● విద్యార్థులతో యూపీ అదనపు
డీజీపీ సత్యనారాయణ
నర్సీపట్నం: భవిష్యత్తులో స్థిరపడేందుకు విద్యార్థి దశలోనే లక్ష్యాలలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ కిల్లాడ సత్యనారాయణ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను సంకల్పంతో నియంత్రిద్దాం అనే అంశంపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు డీజీపీ సత్యనారాయణ, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జట్టి, ఎస్పీ తుహిన్‌సిన్హా హాజరయ్యారు. అదనపు డీజీపీ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా, తమ భవిష్యత్తును సక్రమంగా నిర్మించుకోవాలన్నారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ విద్యార్ధులు సమాజంలో మంచిస్థానాన్ని సంపాదించుకోవాలన్నారు. డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చేయడమే సంకల్పం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఐదు జిల్లాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు విస్తృత చర్యలు చేపడుతున్నారన్నారు. డ్రగ్స్ మాత్రమే కాదు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరుతో వచ్చే కాల్స్‌ను ఎవరూ నమ్మవద్దని, అటువంటి కాల్స్ వచ్చినప్పుడు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ ఒకసారి డ్రగ్స్‌ను వాడితే ఏమీ కాదన్న అపోహలో పడకూడదని, అలవాటు బారిన పడినవారు డబ్బుల కోసం చిన్న చిన్న నేరాలకు పాల్పడి, చివరికి నేరస్థులుగా మారుతున్న వాస్తవాన్ని తెలియజేశారు. హత్యా నేరానికి 14 ఏళ్లు జైలుశిక్ష విధిస్తే, గంజాయి కేసుల్లో 20 ఏళ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. అలవాటు బారిన పడిన వారు సంకోచం లేకుండా డీ–అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందాలని సూచించారు. ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ఎల్.పరమేశ్వరి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అదనపు డీజీపీ సత్యనారాయణను డీఐజీ, ఎస్పీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు గోవిందరావు, ఎల్.రేవతమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి