
ఆదర్శప్రాయుడు అల్లూరి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రాంతంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. ఆయన గొలుగొండ మండలం కృష్ణదేవిపేట (ఏఎల్‌పురం) గ్రామంలో పోలీస్–ప్రజలు నడుపుతున్న అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయాన్ని సందర్శించారు. మైత్రి గ్రంథాయం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. లైబ్రరీలో కంప్యూటర్ రూమ్‌ను ప్రారంభించారు. హైస్కూల్ విద్యార్థులకు విలువైన పుస్తకాలు అందజేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అల్లూరి పేరున పోలీసులు, ప్రజలు మైత్రి గ్రంథాలయం నడపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో చదువుకొని పలువురు మంచి ఉద్యోగాలు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్‌జేడీ విజయ్ భాస్కర్, మైత్రి గ్రంథాలయ వ్యవస్థాపకులు శర్మ, పూర్వపు కొయ్యూరు సీఐ సోమశేఖర్, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ రేవతమ్మ, పూర్వపు కృష్ణదేవిపేట ఎస్‌ఐ తారకేశ్వర్రావు, గొలుగొండ ఎస్‌ఐ రామారావు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, స్థానిక సర్పంచ్ లోచల సుజాతతోపాటు అల్లూరి మైత్రి గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం వరకు సైకిల్ ర్యాలీ
నర్సీపట్నం: విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి నేరస్థులకు సంబంధించి సుమారు రూ.14 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని డీఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. రేంజ్‌లో 85 మందిపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశామన్నారు. వీరిలో 14 మంది ఆస్తులు సీజ్ చేసినట్లు చెప్పారు. శనివారం నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన పాయకరావుపేట నుంచి రాష్ట్ర సరిహద్దు ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్ర పొడువున విద్యార్థులు, యువతను కలిసి గంజాయి వలన కలిగే అనర్ధాలను వివరిస్తామన్నారు. అనంతరం రూరల్ పోలీసు స్టేషన్, నర్సీపట్నం సర్కిల్ కార్యాలయాన్ని డీఐజీ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.