
ఏడో రోజుకు మత్స్యకారుల దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్ రద్దు చేయాలంటూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహరదీక్ష ఏడోరోజుకు చేరుకుంది. శనివారం మత్య్సకారుల ఆందోళనకు జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు సంఘీభావం ప్రకటించారు. ప్రాణభయంతోనే రాజయ్యపేటలో అన్ని సామాజిక వర్గాల వారు బల్క్ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటయితే పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటవుతాయని పరిసర ప్రాంతాలన్నీ వాయు, జలకాలుష్యానికి గురవుతాయన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గంగపుత్రుల గోడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మత్స్యకార నాయకులు ఎరిపిల్లి నాగేశు, మహేష్, కాశీరావు, తాతీలు, కాసులమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ప్లకార్డులు పట్టుకుని మోకాళ్లపై నిలుచుని నిరసన తెలియజేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని, రెండు వేల మెజార్టీ ఇచ్చిన రాజయ్యపేట మత్య్సకారులకు ప్రాణాలను తీసే పరిశ్రమలు ఏర్పాటు చేసి రుణం తీర్చుకుంటోందన్నారు. నిరాహారదీక్షపై హోంమంత్రి అనిత ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్ పాల్గొన్నారు.