
టార్గెట్లు!
టూర్ పేరుతో
కార్పొరేటర్ల అధ్యయన యాత్రకు జీవీఎంసీలోని అన్ని విభాగాల నుంచి కలెక్షన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో కూటమి నేతల వసూళ్ల పర్వానికి అంతులేకుండా పోతోంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ పేరుతో వసూళ్లకు తెగబడిన కూటమి నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో టార్గెట్లు విధించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. జీవీఎంసీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత విభాగాల వారీగా లక్ష్యాలు విధించి మరీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, యూసీడీ ఇలా అన్ని విభాగాల అధికారులను పిలిచి ఇంత మొత్తం వసూలు చేసి ఇవ్వాలంటూ లక్ష్యాలు విధించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జైపూర్, జోద్‌పూర్, జైసల్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో అధ్యయన యాత్ర పేరుతో జీవీఎంసీ కార్పొరేటర్లు వెళుతున్నారు. ఈ యాత్రకు జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, సీపీఎం కార్పొరేటర్ గంగారావుతో సహా 15 మంది దూరంగా ఉంటున్నారు. అయితే, కార్పొరేటర్లు టూర్ వెళుతున్నందున.. కూటమి కార్పొరేటర్లకు కొంత మొత్తం ఖర్చుల కోసం ఇవ్వాలంటూ ఈ వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు కొన్ని విభాగాల నుంచి సదరు కీలక నేతకు భారీ మొత్తం ముట్టినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కోటి రూపాయల మేర ఈ విధంగా దండుకున్నట్టు తెలుస్తోంది.
సీఎం కంటే టూరే ముద్దు!
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విశాఖ వస్తున్నారు. అయితే, సీఎం నగరానికి వస్తున్న సమయంలో ప్రోటోకాల్ మేరకు నగర ప్రథమ పౌరుడు మేయర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయినప్పటికీ సీఎం పర్యటనకు ముందు రోజే మేయర్ పీలా శ్రీనివాసరావు విమానంలో పర్యటనకు వెళ్లిపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర ప్రథమ పౌరుడిగా సీఎంకు స్వాగతం పలకకుండా టూర్‌కు వెళ్లడం ఏమిటంటూ వాపోతున్నారు. ఇప్పటికే మేయర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సొంత పార్టీకి చెందిన నేతలు.. ఇదే విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.