
ఉపమాకలో ఘనంగా ఉట్లోత్సవం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలోరెండు రోజుల పాటు జరిగిన వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఈవే డుకల్లో భాగంగా ఉట్ల ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలు, అరాధనలు కై ంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పీఠంపై ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఉట్టికి షోడోపచారపూజలు నిర్వహించారు. అనంతరం ఏకాంతంగా ఉట్లోత్సవం నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పాలు, తీర్థగోష్టి, నిత్యసేవాకాలం, విశేష ప్రసాద నివేదన, ప్రసాద వినియోగం జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, రాజగోపాలాచార్యులు, శ్రీనివసాచార్యులు,గోపాలాచార్యులు పాల్గొన్నారు.